![]() |
![]() |
అది ఒక బిజీ ఏరియా. నగరం నడిబొడ్డున ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియా. సడన్‌గా ఒక స్టార్ హీరో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పైగా అతను ఫుల్‌గా తాగి ఉన్నాడు. వచ్చే పోయే వాహనాలకు అడ్డు వెళుతూ ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తున్నాడు. అంతలోనే ఒక ఆటోవాలా వచ్చి అతన్ని బ్రతిమలాడి ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో సన్ని డియోల్.
ప్రస్తుతం ఈ వీడియో గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతూ సన్ని డియోల్‌ని విమర్శిస్తున్నారు. బాధ్యత లేకుండా ఇలా సీనియర్లు ప్రవర్తిస్తే.. ఎలా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత అందరూ అసలు విషయం తెలుసుకొని కామ్ అయిపోయారు. వాస్తవానికి ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో సన్ని డియోల్ బాధ్యత లేకుండా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఎలాంటి వివాదాలు కొని తెచ్చుకోలేదు. ఇప్పుడు ఈ వీడియోలో సన్ని నిజంగానే తాగి ఉన్నాడన్న భ్రమ కలిగించేలా ఎవరో వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చను గమనించిన సన్ని.. అదంతా సినిమా షూటింగ్‌లో భాగమేనని వివరణ ఇచ్చాడు.
సన్నీడియోల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘సఫర్’ చిత్రం కోసం ముంబైలోని జుహు సర్కిల్‌లో ఓ సన్నివేశాన్ని అర్థరాత్రి చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఎక్కడా కెమెరాలు కనిపించకపోవడంతో అదంతా నిజమే అనుకున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌లో కెమెరాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అది సినిమాకి సంబంధించినదే అని తెలిపేందుకు ఒరిజినల్‌గా షూట్ చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశాడు సన్ని డియోల్. ఎవరో చేసిన ఆకతాయి పనికి సన్ని డియోల్ స్వయంగా వివరణ ఇచ్చుకొని వీడియోను షేర్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.
![]() |
![]() |